సుమతి శతకాలు

స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలలితము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.

మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!

తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!

తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.

శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.

వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!

తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి

వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.

వెలయాలివలనఁ గూరిమి

గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

తాత్పర్యం:పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు. •

వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.

వరి పంటలేని యూరును
దొరయుండని యారు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు. •

వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!

తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.

లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

తాత్పర్యం: పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!

తాత్పర్యం: సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

రా పొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం.

నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

తాత్పర్యం: పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు.

మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!

తాత్పర్యం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.

బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?

బంగారు కుదువబెట్టకు
సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో
నంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

తాత్పర్యం: బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.

పొరుగున పగవాడుండిన
నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

తాత్పర్యం: ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.

పులిపాలు దెచ్చిఇచ్చిన
నలవడఁగ గుండెగోసి యరచే నిడినం
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!

తాత్పర్యం: దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!

తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.

పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

తాత్పర్యం: పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.

పరసతుల గోష్టినుండి
పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
బరుసతి సుశీయైనను
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

తాత్పర్యం: భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును.

పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

తాత్పర్యం: ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము.

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

తాత్పర్యం: పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.

తన కోపమె తన శతృవు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తాత్పర్యం: తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం

చుట్టములు గానివారలు
చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

తాత్పర్యం: ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.

కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

తాత్పర్యం: పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.

కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

తాత్పర్యం: ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి.

కమలములు నీడఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.

కనకపు సింహాసనము
శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
దడవుండనిచ్చె నేనియు
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!

తాత్పర్యం: ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.

ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా!

ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.